: టీమిండియాకు బౌలింగ్ కోచ్ ఉన్నట్టా? లేనట్టా?: మాజీల విమర్శ
ధోనీ సేన వరుస పరాజయాలపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు ధోనీ టెస్టు కెప్టెన్సీ వదులుకుంటే మంచిదని సలహా ఇస్తుంటే, మరికొందరు కోచ్ ను తప్పించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బౌలింగ్ కోచ్ జోయ్ డాస్ పైనా విమర్శలు గుప్పించారు. 'అసలు టీమిండియాకు బౌలింగ్ కోచ్ ఉన్నట్టా? లేనట్టా?' అని ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ళ క్రితం ఎరిక్ సిమన్స్ స్థానంలో బౌలింగ్ శిక్షకుడిగా టీమిండియాతో జత కలిసిన డాస్ వల్ల ఒరిగిందేమీ లేదని మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్య అన్నాడు. కేవలం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన వాళ్ళను నియమిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని, అంతర్జాతీయ అనుభవం ఉన్నవారినే బౌలింగ్ కోచ్ గా తీసుకోవాలని సూచించాడు. ఇషాంత్ లాంటి బౌలర్లకు దిశానిర్దేశం చేయగల కోచ్ ప్రస్తుతం అవసరమని, మంచి శిక్షకుడు లేని ఫలితంగా ఏటా మంచి బౌలర్లను కోల్పోతున్నామని వైద్య వివరించాడు.
ఇక మాజీ పేసర్ చేతన్ శర్మ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వివిధ పిచ్ లపై అనుభవం సంపాదించిన భారత క్రికెటర్ ను బౌలింగ్ కోచ్ గా నియమిస్తే సత్ఫలితాలు పొందవచ్చని సూచించాడు. జహీర్ ఖాన్ ను భారత బౌలింగ్ సలహాదారుగా నియమిస్తే మేలని కూడా చేతన్ శర్మ పేర్కొన్నాడు.