: బుగ్గలను కొరుక్కుంటూ నోటి కేన్సర్ బారినపడ్డ బాలిక
మనం ఏదైనా తింటున్నప్పుడు బుగ్గలు పంటికింద పడి నోటి లోపల గాయాలు అవడం సహజం. కానీ, ఇలా తరచూ కొరుక్కోవడం వల్ల ఛత్తీస్ గఢ్ లో 18 ఏళ్ల బాలిక నోటి కేన్సర్ బారిన పడింది. అంబికాపూర్ కు చెందిన ఆ బాలిక నోటి లోపల కొరుక్కోవడంతో గాయం కాగా, ఎంతకీ నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లింది. డాక్టర్ మందులు రాసిచ్చారు. అయినా తగ్గకపోయే సరికి రాయ్ పూర్ లోని ప్రాంతీయ కేన్సర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ బయాప్సీ పరీక్షలో బాలికకు నోటి కేన్సర్ ఉన్నట్లు తేలింది. ఇది చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమెకు పొగాకు ఉత్పత్తులను వాడే అలవాటు లేదు. కేవలం బుగ్గలను కొరకడం వల్లే కేన్సర్ రావడం ఏంటీ? అంటూ వారు ఆలోచనలో పడ్డారు. ఇలాంటి కేసును వారు చూడడం ఇదే మొదటి సారి. అయితే, అదృష్టవశాత్తూ ఆమెకు కేన్సర్ మొదటి దశలో ఉండడంతో సర్జరీ తర్వాత పూర్తి ఆరోగ్యవంతురాలు కానుంది.