: తీర్పుకు 24 గంటల ముందు సంజూ ఏం చేశాడంటే..
ముంబయి పేలుళ్ళ కేసులో ఐదేళ్ళ జైలు శిక్షకు గురైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తీర్పుకు ఓ రో్జు ముందు, అంటే, బుధవారం యధావిధిగానే షూటింగ్ కు హాజరయ్యాడట. 'పోలీస్ గిరి' అనే చిత్రానికి సంబంధించి ఓ పాట షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రాచీ దేశాయ్ తో పాట చిత్రీకరిస్తుండగా సంజూ ఎంతో ఉత్సాహంగా కనిపించాడని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
అయితే, సాయంత్రం 6 గంటల వేళ ఓ ఫోన్ కాల్ వచ్చే వరకు కూడా ఈ ఆజానుబాహుడు అందరితో కలివిడిగా ఉన్నాడని వారు వెల్లడించారు. ఆ ఫోన్ కాల్ రావడంతోనే సంజూ ముఖంలో రంగులు మారాయట. తీవ్ర ఒత్తిడికి గురైనట్టుగా అతని బాడీ లాంగ్వేజి ఒక్కసారిగా మారిపోయిందని ఆ చిత్ర యూనిట్ లో ఓ వ్యక్తి వెల్లడించాడు. వెంటనే తన వ్యాన్ వద్దకు వెళ్ళినా ప్యాకప్ టైమ్ వరకు షూటింగ్ స్పాట్ ను వీడని సంజయ్.. షెడ్యూల్ ప్రకారం పాట చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత 6.45 కు పయనమయ్యాడట.
కాగా, ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న సంజయ్ దత్ కు జైలు శిక్ష పడడంతో సినిమా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై ఈ చిత్ర నిర్మాత రాహుల్ అగర్వాల్ స్పందించారు. 'ఆ వార్త విని ఎంతో షాక్ కు గురయ్యాను. సరిగ్గా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన డేట్స్ గురించి ఆలోచించలేను. సంజయ్ దత్ నా పెద్దన్న లాంటి వాడు. ఇప్పుడు నాకు సినిమా కన్నా సంజయ్ దత్తే ముఖ్యం' అని విచారం వ్యక్తం చేశాడు.