: వరకట్న కేసుల్లో ఏపీనే టాప్...!
వరకట్నం వద్దని చెబుతున్నా వరులు వినటం లేదు. వరకట్న నిషేధానికి ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చినా ప్రయోజన్యం శూన్యం. వరకట్న వేధింపులు దేశంలో క్రమేపీ పెరుగుతూనే ఉన్నాయి. వరకట్న కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా, ఒడిశా రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. 2012 సంవత్సరానికి గాను జాతీయ నేర పరిశోధన విభాగం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2,511 వరకట్న వేధింపుల కేసులతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా, 1,487 కేసులతో ఒడిశా రెండో స్థానంలో ఉంది. వరకట్నం కంటే గృహ హింస కేసులే ఎక్కువగా నమోదయినట్లు జాతీయ నేర పరిశోధన విభాగం స్పష్టం చేసింది.
గృహ హింస కేసుల్లో తమిళనాడు రాష్ట్రం టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే మన రాష్ట్రంలో గృహ హింస కేసులు కూడా ఎక్కువగానే నమోదయినట్లు నివేదికలో వెల్లడైంది. తమిళనాడులో 3,838 గృహ హింస కేసులు నమోదవ్వగా, మన రాష్ట్రంలో 2,150 కేసులు నమోదయ్యాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో వరకట్న, గృహ హింస కేసులు పెరుగుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో వీటిపై కేసులే నమోదు కాలేదు. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదు కాలేదు.