: ఫ్లెచర్ మెడపై కత్తి
విదేశీ గడ్డపై భారత పరాజయాలకు కోచ్ డంకన్ ఫ్లెచర్ ను బలిపశువును చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. వచ్చే నెలతో కాంట్రాక్టు కాలపరిమితి పూర్తి చేసుకుంటున్న ఫ్లెచర్ ను సాగనంపాలని బీసీసీఐ నిర్ణయించినట్టు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అందుకు నిదర్శనంగా.. బోర్డు అధికారులు ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ తో మంతనాలు జరిపారని హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రచురించింది. టీమిండియా కొత్త కోచ్ ఫ్లవర్ కావొచ్చని బీసీసీఐ అధికారులను ఉటంకిస్తూ హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.
2011 ప్రపంచకప్ తర్వాత గ్యారీ కిర్ స్టెన్ నుంచి కోచింగ్ బాధ్యతలు స్వీకరించిన ఫ్లెచర్ హయాంలో టీమిండియా ప్రస్థానం పడుతూ లేస్తూ సాగింది. స్వదేశంలో విజయాలు నమోదు చేసుకున్నా, విదేశీ పర్యటనలకొచ్చేసరికి దారుణ పరాభవాలు చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో వైట్ వాష్ లు, ఇటీవలి సఫారీ టూర్, కివీస్ పర్యటన భారత్ కు పీడకలల్లాంటివని చెప్పొచ్చు. దీంతో, ఫ్లెచర్ వ్యూహాలపై సందేహాలు తలెత్తుతున్నాయి. సొంతగడ్డపై స్పిన్ తో నెట్టుకొస్తున్నా, ఫాస్ట్ పిచ్ లపై తేలిపోతుండడం టీమిండియా వ్యూహ సన్నద్ధతను వేలెత్తిచూపుతోంది.
ఇక ఆండీ ఫ్లవర్ విషయానికొస్తే.. ఇటీవల ఇంగ్లండ్ జట్టు యాషెస్ లో ఘోర పరాజయం పాలవడంతో వేటు ఎదుర్కోక తప్పలేదు. ప్రస్తుతం ఖాళీగానే ఉన్న ఈ జింబాబ్వే దిగ్గజాన్ని టీమిండియాకు కోచ్ గా నియమిస్తే.. వచ్చే ఏడాది వరల్డ్ కప్ నాటికి జట్టు కుదురుకుంటుందని బీసీసీఐ భావిస్తోంది.