: సభ్యులను భయపెట్టి లోక్ సభలో బిల్ ఆమోదించారు: సుజనాచౌదరి
విభజన బిల్లు పూర్తిగా అప్రజాస్వామికమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రాజ్యసభలో టీబిల్లుపై చర్చ సందర్భంగా తెలిపారు. టీడీపీ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, విభజన తీరును మాత్రం ప్రశ్నిస్తోందని చెప్పారు. 2004లో మేనిఫెస్టోలో తెలంగాణను చేర్చిన కాంగ్రెస్ పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఇన్ని రోజులు ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ 10 రోజుల్లో వస్తుందనగా ఇంత హడావిడిగా రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ఓ పక్క టీఆర్ఎస్ ను, మరో వైపు వైఎస్సార్సీపీని కలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందని చెప్పారు. ఎంపీలను భయభ్రాంతులకు గురిచేసి లోక్ సభలో బిల్లును ఆమోదించారని తెలిపారు. లోక్ సభలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోనే టీబిల్లుపై ఏకాభిప్రాయం లేదని ఆరోపించారు. తెలంగాణ వెనకబడలేదని శ్రీకృష్ణ కమిటీ తెలిపిందని గుర్తుచేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా మారారని ఎద్దేవా చేశారు.