: 'ఎర్త్ అవర్' కార్యక్రమంలో 150కి పైగా భారత నగరాలు
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తోన్న 'ఎర్త్ అవర్' కార్యక్రమంలో ఈసారి 150కి పైగా భారత నగరాలు పాల్గొంటున్నాయి. రేపు జరగనున్న ఈ కార్యక్రమంలో భారత నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 7000 నగరాలు ఓ గంటపాటు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నాయి.
గత ఏడాది భారత్ లో 150 నగరాలు 'ఎర్త్ అవర్' కు మద్దతు పలికాయని, ఈ పర్యాయం వాటి సంఖ్య మరింత పెరుగుతుందని ఆశిస్తున్నామని ఎర్త్ అవర్ గ్లోబల్ సీఈవో, సహవ్యవస్థాపకుడు ఆండీ రిడ్లే తెలిపారు. వైల్డ్ వెల్ఫేర్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్).. ఎర్త్ అవర్ గ్లోబల్ కు మాతృసంస్థ. వాతావరణ మార్పులు, మానవాళిపై వాటి ప్రభావం వంటి అంశాలపై ఎర్త్ అవర్ గ్లోబల్ సంస్థ 2007 నుంచి ప్రజలను చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది.
తొలిసారిగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో 'ఎర్త్ అవర్' కు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమంలో ఓ గంటపాటు గృహాల్లోనూ, కార్యాలయాల్లోనూ, పరిశ్రమల్లోనూ విద్యుత్ నిలిపివేస్తారు. కాగా, రేపు చేపట్టనున్న 'ఎర్త్ అవర్' లో రాత్రి 8.30 నుంచి 9.30 వరకు విద్యుత్ నిలిపివేయాలని నిర్వాహకులు ప్రజలకు పిలుపునిచ్చారు.