: జహీర్ ఖాన్ పై ద్రావిడ్ సందేహం
టీమిండియా సీనియర్ బౌలర్ జహీర్ ఖాన్ సన్నద్ధతపై బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ సందేహం వ్యక్తం చేస్తున్నాడు. అతడి ఫిట్ నెస్ టెస్టులకు సరిపోకపోవచ్చని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. గాయం నుంచి కోలుకుని ఇటీవలే జట్టులోకి తిరిగొచ్చిన జహీర్ దక్షిణాఫ్రికా, కివీస్ పర్యటనల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీనిపై ద్రావిడ్ మాట్లాడుతూ, ఇంగ్లండ్ తో జరగబోయే టెస్టు సిరీస్ లో ఐదు టెస్టులూ ఆడేంత ఫిట్ నెస్ జహీర్ కు ఉందా? అని తనకు అనుమానంగా ఉందని పేర్కొన్నాడు. కపిల్ దేవ్ తర్వాత భారత్ కు లభించిన అత్యుత్తమ బౌలర్ జహీరే అని, అయితే, అలాంటి బౌలర్ కెరీర్ చివరి దశలో 120-125 కిమీ వేగంతో బంతులేస్తూ, తరచూ విఫలమవడాన్ని చూడలేకపోతున్నానని ద్రావిడ్ విచారం వ్యక్తం చేశాడు. భవిష్యత్ పై జహీర్ తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇదే తగిన సమయమని చెప్పాడు.