: అమెరికా 'షూ బాంబు' హెచ్చరిక
విదేశాల నుంచి అమెరికాకు విమాన సర్వీసులు నిర్వహించే అన్ని విమానయాన సంస్థలకు 'షూ బాంబు' హెచ్చరికలు జారీ అయ్యాయి. అమెరికా అంతర్గత భద్రత విభాగం ఈమేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మిలిటెంట్లు తమ షూలో బాంబులు దాచి అమెరికాలో ప్రవేశించే అవకాశముందని పేర్కొంది. 2001, సెప్టెంబర్ 11 నాటి దాడుల అమెరికా అంతర్గత భద్రత పరంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోంది. దేశాధినేతలను సైతం క్షుణ్ణంగా పరిశీలించిన పిదపే అనుమతిస్తోంది. కాగా, 2001 డిసెంబర్లో రిచర్డ్ రీడ్ అనే బ్రిటన్ పౌరుడు షూలో పేలుడు పదార్థాలతో విమానం ఎక్కాడు. అయితే అతడు విధ్వంసానికి పాల్పడకముందే, తోటి ప్రయాణికులు అతడిని అడ్డుకున్నారు. 2009లో ఉమర్ ఫరూఖ్ అనే నైజీరియా దేశస్తుడు అండర్ వేర్ లో బాంబును దాచి ఆమ్ స్టర్ డామ్ నుంచి డెట్రాయిట్ వచ్చి దొరికిపోయాడు.