: కమల్ నాథ్ పెద్ద ఛీటర్: మోదుగుల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో పెద్ద మోసగాడు కేంద్ర మంత్రి కమల్ నాథ్ అని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జాతీయ పార్టీల హోదాలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై దేశాన్ని నాశనం చేస్తున్నాయని అన్నారు. కూడబలుక్కుని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్న బిల్లుకు మద్దతు పలుకుతున్న బీజేపీకి సీమాంధ్ర ప్రజల డిమాండ్లు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రుల రక్షణకు ఎవరు హామీ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో సహజవనరుల దోపిడీపై సీమాంధ్ర ప్రజలకు ఎవరు హామీ ఇస్తారని ఆయన నిలదీశారు. చాలా అంశాలు ముడిపడి ఉన్నందునే తాము విభజనను వ్యతిరేకిస్తున్నామని మోదుగుల స్పష్టం చేశారు.