: తిరుపతిలో ప్రారంభమైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు (బుధవారం) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ సందర్భంగా ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. ధ్వజస్తంభం వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం గరుడ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఆవిష్కరింపజేశారు. ఈరోజు రాత్రి స్వామి వారు పెద్దశేషవాహనంపై ఆసీనులై.. తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో శ్రీనివాస మంగాపురానికి తరలివచ్చారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.