: బీజేపీతో చర్చల్లో ప్రతిష్ఠంభన.. బిల్లు నెగ్గుతుందా?
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ఆమోదింపజేయడం కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారింది. బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలను ఒప్పించడానికి ప్రధానితో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి ముచ్చెమటలు పడుతున్నాయి. లోక్ సభలో ఆమోదించేందుకు మద్దతిచ్చిన బీజేపీ, తాము సూచించిన ఒక్క సవరణనూ చేపట్టకపోవడంతో పునరాలోచనలో పడింది.
రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. విభజన బిల్లుకు మద్దతిచ్చి తమ పార్టీ కూడా అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. అసలే బీజేపీకి సీమాంధ్రలో అనుకున్నంత ఆదరణ లభించడం లేదు. దీంతో సవరణలు సూచించి, సాధించి పార్టీ పరువు నిలుపుకోవచ్చని ఆ పార్టీ నేతల ఆలోచన.
దీంతో బీజేపీ సీనియర్ నేతలు తాము సూచించిన సవరణలు బిల్లులో ప్రతిపాదిస్తే తప్ప రాజ్యసభలో బిల్లు గట్టెక్కే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. దీంతో బిల్లులో సవరణలు ప్రతిపాదిస్తే లోక్ సభలో మరోసారి చర్చించాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితే వస్తే, లోక్ సభలో మరోసారి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఊహించలేకపోతోంది. దీంతో బీజేపీ సవరణలపై కాంగ్రెస్ తీవ్ర సంఘర్షణలో పడిందని సమాచారం.
ఎటూ తేల్చుకోలేక బిల్లుపై రాజ్యసభలో ప్రకటన చేసి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. మరి, ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరోసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఈ చర్చలు గాలివాటమని తేలుస్తారో, లేక చిత్తశుద్ధితో సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారో తేలాలంటే రేపు ఉదయం వరకు వేచి చూడాల్సిందే!