: సీమాంధ్రకు ప్యాకేజీపై ముగిసిన చర్చ
సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీపై ప్రధాని మన్మోహన్ సింగ్ తో బీజేపీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు సమావేశం ముగిసింది. ఢిల్లీలో ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో నాలుగు ప్రధాన అంశాలపై సవరణలు చేయాలంటూ బీజేపీ పట్టుపట్టింది. దీంతో హైదరాబాదులో శాంతిభద్రతలు, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ముంపు మండలాలు సీమాంధ్రలో కలపడం, పన్ను రాయతీలు వంటి అంశాలపై బీజేపీ పట్టుపట్టినట్టు సమాచారం.
ఈ భేటీలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు జైరాం రమేష్, అహ్మద్ పటేల్, కమల్ నాథ్ లు కూడా పాల్గొన్నారు. అలాగే ఆర్థిక శాఖాధికారులను కూడా సమావేశానికి ఆహ్వానించి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. కాగా సవరణలపై రాజ్యసభలో ప్రకటన చేస్తారని, బిల్లులో పొందుపరచడం ఉండదని తెలిపినట్టు సమాచారం. బిల్లులో పొందుపరిస్తే లోక్ సభలో మరోసారి దుమారం రేగే అవకాశం ఉందని, అందువల్ల రాజ్యసభలో ప్రకటన చేస్తామని చెబుతున్నట్టు సమాచారం.