: రాజ్యసభలో సీఎం రమేష్ వీరావేశం!
ఈ రోజు రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో సీమాంధ్ర ఎంపీలు హల్ చల్ చేశారు. సభ కార్యదర్శి నుంచి పేపర్లు లాక్కునేందుకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ యత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కార్యదర్శి కూడా ప్రయత్నించారు. అంతే కాకుండా, డిప్యూటీ ఛైర్మన్ కురియన్ దగ్గర పేపర్లను లాక్కునేందుకు కూడా రమేష్ యత్నించారు. దీంతోపాటు, కురియన్ తో వాగ్వాదానికి కూడా దిగారు. అయితే, సీఎం రమేష్ ప్రయత్నాలను తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో టీడీపీ ఎంపీ గుండు సుధారాణి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు 'వి వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్' అనే పెద్ద బ్యానర్ ను ప్రదర్శిస్తూ ఛైర్మన్ పోడియం ముందు అడ్డంగా నిలబడ్డారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలందరూ సమైక్యాంధ్ర నినాదాలతో సభను హోరెత్తిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో, విధిలేని పరిస్థితుల్లో కురియన్ సభను వాయిదా వేశారు.