: సీఎం కిరణ్ పై చిరంజీవి ఫైర్


ముఖ్యమంత్రి కిరణ్ పై కేంద్ర మంత్రి చిరంజీవి విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక రకంగా విభజనకు సీఎం కూడా కారణమని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని సీఎం కిరణ్ చెప్పేవారని... ఆయన మాటను తామంతా నమ్మామని... కానీ, బిల్లును ఆపడానికి ఆయన చేసిన ప్రయత్నాలేమీ లేవని విమర్శించారు. ఇప్పుడు రాజీనామా చేసి తప్పుకోవాలని భావిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు కిరణ్ పార్టీ పెట్టినా, ఆయన పార్టీ అజెండాలో ఏ అంశాలు పెడతారని ప్రశ్నించారు. ఆయన దగ్గర్నుంచి నాయకులంతా ఒక్కొక్కరే జారిపోతున్నారని తెలిపారు.

విభజన బిల్లు లోక్ సభలో ఆమెదం పొందడంపై తమ అసంతృప్తిని రాజ్యసభలో వెల్లడిస్తామని చెప్పారు. సీమాంధ్రుల అభిప్రాయాలను హైకమాండ్ పరిగణనలోకి తీసుకోలేదని భావిస్తున్నామని చిరంజీవి చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాలను, భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. హైదరాబాదుపై గవర్నర్ కు అధికారాలు కట్టబెడతామని, యూటీ స్టేటస్ హైదరాబాదుకు ఉంటుందంటున్నారని... కానీ పక్కాగా యూటీ కాదని చెబుతున్నారని... ఈ విషయాల్లో మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

జరిగిన వ్యవహారంలో ఒక్క కాంగ్రెస్ పార్టీనే తప్పుపట్టడం తగదని... అన్ని పార్టీల భాగస్వామ్యం ఇందులో ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేలా చేపట్టే చర్యలను తాను అంగీకరించనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలి పోవడమంటే, పాలు తాగి రొమ్ము గుద్దడమే అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News