: ప్రజల కోసం తుపాకీ పట్టిన ఎమ్మెల్యే
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ ఎమ్మెల్యే ఘాజీ ఖాన్ తన నియోజకవర్గ ప్రజల రక్షణ కోసం తుపాకీ పట్టాడు. గత డిసెంబర్లో ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుంచి తప్పించుకుని వచ్చిన ఓ పులి యూపీలో ప్రవేశించి 10 మందిని పొట్టనబెట్టుకుంది. ఎమ్మెల్యే ఘాజీ ఖాన్ నియోజకవర్గంలోనే ఆరుగురిని బలి తీసుకుందా రక్తం రుచి మరిగిన వ్యాఘ్రం. దీంతో, తన ప్రజలను రక్షించుకునేందుకు ఈ శాసనసభ్యుడు రైఫిల్ తో రంగంలోకి దిగాడు. పులి ఆచూకీ కోసం సమీప అటవీప్రాంతంలో గుర్రంపై తిరుగుతూ వేట మొదలు పెట్టాడు. అయితే, ఎమ్మెల్యే వ్యవహారం అటవీ శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. అది వన్యప్రాణి రక్షిత ప్రాంతమని, ఆయుధాలతో సంచారం నిషిద్ధమని వారు ఘాజీ ఖాన్ కు సూచించారు. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమే అని ఆ ఎమ్మెల్యే స్పష్టం చేశాడు. తాను జాతీయ స్థాయి షూటింగ్ చాంపియన్ ను అని, పులిని చంపగలిగితే ప్రజలకు సేవ చేసినట్టే అని సమర్థించుకున్నాడు.