: ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ముషారఫ్
పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ నేడు కోర్టుకు హాజరయ్యారు. దేశ ద్రోహం కేసులో ఆయన నేడు ఇస్లామాబాద్ కోర్టుకు వచ్చారు. 2007లో తాను అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో నేరం నిరూపితమైతే ముషారఫ్ కు మరణశిక్ష ఖాయం. ఈ కేసులో ఇప్పటివరకు పలుమార్లు విచారణలు జరిగినా, ముషారఫ్ ఒక్క పర్యాయం మినహా మిగతా ట్రయల్స్ కు గైర్హాజరయ్యారు. కాగా, ఈ వ్యవహారంపై ముషారఫ్ మాట్లాడుతూ, ప్రధాని నవాజ్ షరీఫ్ తనపై ప్రతీకారం తీర్చుకుంటున్నాడని ఆరోపించారు. 1999లో తాను షరీఫ్ ప్రభుత్వంపై సైనిక చర్య తీసుకున్నందుకు ప్రతిగానే తనపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని ముషారఫ్ పేర్కొన్నారు. కాగా, అప్పట్లో తనను సైన్యం పదవి నుంచి దించేయడంతో నవాజ్ షరీఫ్ సౌదీ అరేబియాలో ప్రవాసం గడిపారు.