: కాంగ్రెస్ వ్యవహారశైలికి వ్యతిరేకంగానే రాజీనామా: గంటా
ఓవైపు ప్రతిపక్షాలు వద్దంటున్నాయి, మరోవైపు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు, ఇంకోవైపు బీజేపీ కూడా ప్రశ్నిస్తోంది... అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం విభజన విషయంలో ముందుకే వెళ్లాలనుకుంటోందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కాంగ్రెస్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూనే పదవికి, పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాజీనామా చేసిన తర్వాతైనా కాంగ్రెస్ బుద్ధి మారుతుందని భావిస్తున్నామని తెలిపారు. తెలుగువారి ప్రమేయం లేకుండా, తెలుగుజాతి భవిష్యత్తును నిర్ణయించే దారుణం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ రాజీనామా చేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేసినా, అధిష్ఠానం పట్టించుకోని పరిస్థితి ఉందని గంటా అన్నారు. ముఖ్యమంత్రి కూడా తన పదవికి రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆరోపించారు.