: కాంగ్రెస్ ప్లాన్ ఏంటి?..అంతా పద్దతి ప్రకారం ముగుస్తుందా?
తెలంగాణ బిల్లును ఎలాగైనా గట్టెక్కించేందుకు కాంగ్రెస్ పార్టీ సామ, దాన, భేద, దండోపాయాలన్నీ పాటిస్తోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా చర్చను అడ్డుకునే అవకాశమున్న ఎంపీలందర్నీ సస్పెన్షన్ పేరుతో లోక్ సభ బయటకు పంపింది. దీంతో పార్లమెంటులో సమైక్య వాదం తీవ్రతను కొంత తగ్గించగలిగింది.
అయినప్పటికీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సభను అడ్డుకుంటుండడంతో కొత్త వ్యూహానికి పదును పెడుతోంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీని సందిగ్ధావస్థలో పడేస్తుండడంతో బిల్లు ఓడిపోయే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం అందుకు అస్కారం లేకుండా బిల్లును ఆమోదింపజేసేందుకు కొత్త గేమ్ ప్లాన్ అమలు చేస్తోంది.
బిల్లుపై ఓటింగ్ జరిగితే... కొంత మంది పార్లమెంటు సభ్యులు అందుబాటులో లేనందువల్ల బిల్లు ఆమోదం పొందదనే అనుమానంతో, కాంగ్రెస్ నేతలంతా రేపటి సభకు అందుబాటులో ఉండాలని ఆదేశించనుంది. అలాగే, సభలో గందరగోళం నడుమ బిల్లుపై చర్చ జరిపి, మూజువాణి ఓటుతో బిల్లును గట్టెక్కించాలని కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పథకం రచించినట్టు సమాచారం.