: 60 శాతం ఉన్న ఆంధ్రులు 20 శాతం ఆదాయంతో ఎలా బతుకుతారు?: జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రులు 60 శాతం మంది ఉండగా, 20 శాతం ఆదాయాన్ని కేటాయిస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. హైదరాబాద్ ను సీమాంధ్ర ప్రజలు ఎలా విడిచి వెళతారని జగన్ నిలదీశారు. విభజనతో రెండు ప్రాంతాల ప్రజలు నష్టపోతారని వివరించారు. కాంగ్రెస్ విభజించు, పాలించు పద్ధతిలో ముందుకెళుతోందని ఆరోపించారు. ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా అసెంబ్లీ తీర్మానం లేకుండా ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ స్పష్టంగా వ్యతిరేకించిందని తెలిపారు. అయినా, దాన్ని లోక్ సభలో ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. సభలో ఈ విధంగా బిల్లు ప్రవేశపెట్టడం అన్యాయమని తాము స్పీకర్ ను కోరామని, అన్యాయానికి నిరసనగా స్పీకర్ చాంబర్ నుంచి వాకౌట్ చేశామని జగన్ చెప్పుకొచ్చారు.