: 'కోట్లా'టకు సై అంటున్న భారత్, ఆసీస్


భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ చరమాంకానికి చేరుకుంది. టీమిండియా ఇప్పటికే సిరీస్ ను 3-0తో చేజిక్కించుకోగా, సిరీస్ లో ఆఖరి మ్యాచ్ రేపటి నుండి ఢిల్లీలోని కోట్లా మైదానం వేదికగా జరగనుంది. చివరి మ్యాచ్ నూ నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలని ఆతిథ్య జట్టు భావిస్తుండగా, గెలిచి పరువు నిలుపుకోవాలని ఆసీస్ తలపోస్తోంది. భారత్ మరోసారి స్పిన్నర్లనే నమ్ముకుంటోంది.

తొలి మూడు టెస్టుల్లో స్పిన్ త్రయం అశ్విన్, ఓజా, జడేజా అమోఘంగా రాణించిన సంగతి తెలిసిందే. వీరికి తోడు యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ కొత్తబంతితో చెలరేగిపోతున్నాడు. ఆరంభంలో అతన్ని నిలువరించడం కంగారూలకు కష్టసాధ్యంగా పరిణమిస్తోంది. బ్యాటింగ్ లో కొత్త ఓపెనర్ శిఖర్ ధావన్ గైర్హాజరీలో పుజారా ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో, రహానే, రైనాల్లో ఒకరు మిడిలార్డర్ లో బరిలో దిగుతారు. మరోవైపు మూడో టెస్టు నుంచి వివాదాస్పదంగా వేటుకు గురైన ఆసీస్ వైస్ కెప్టెన్ షేన్ వాట్సన్ మళ్ళీ జట్టుతో కలిశాడు. మొహాలీ మ్యాచ్ ఆరంభానికి ముందే వాట్సన్ స్వదేశానికి పయనమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెప్టెన్ క్లార్క్ కు గాయం కావడంతో ఢిల్లీ మ్యాచ్ లో వాట్సన్ జట్టు పగ్గాలందుకునే అవకాశాలున్నాయి.

పేసర్ స్టార్క్ కూడా గాయంతో బాధపడుతుండడంతో ఈ మ్యాచ్ లోనూ ఆసీస్ కష్టాలు తీరేట్టు కనిపించడంలేదు. తమ బ్యాట్స్ మెన్ శుభారంభాల్ని భారీ స్కోర్లుగా మలచాలని, అప్పుడే భారత్ పై ఒత్తిడి పెంచగలమని ఆసీస్ శిబిరం భావిస్తోంది. ఇక కోట్లా పిచ్ స్పిన్నర్లకే వంత పాడడం ఖాయమని క్యూరేటర్ వెంకట సుందరం చెబుతున్నారు. దీంతో, మరోసారి కంగారూలకు కష్టాలు తప్పేట్టులేవు. 

  • Loading...

More Telugu News