: భూమిపైకి దూసుకొస్తున్న రష్యా ఉపగ్రహం
కాలపరిమితి ముగిసిన రష్యా ఉపగ్రహం భూమి దిశగా దూసుకువస్తోంది. మూడు టన్నుల బరువున్న దీన్ని కాస్మోస్-1220గా గుర్తించారు. ఇది మిలిటరీ అవసరాల నిమిత్తం ఉద్దేశించిన ఉపగ్రహం. దీన్ని పసిఫిక్ మహాసముద్రంలో పడేలా ఏర్పాట్లు చేశామని, అయితే, అనూహ్య పరిణామాలు ఏవైనా సంభవించవచ్చని, తద్వారా అది భూమిపై జనావాస ప్రాంతాల్లో పడే ముప్పు పొంచి ఉందని రష్యా అంతరిక్ష పరిశోధన శాఖ అధికారులు తెలిపారు. 1980లో సిక్లాన్-2 రాకెట్ ద్వారా దీన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. భూవాతావరణంలోకి ప్రవేశించగానే ఇది మండిపోతుందని, అయితే, భారీ ఉపగ్రహం కావడంతో శకలాలు ఎక్కడైనా పడొచ్చని అధికారులు అంటున్నారు. ఆదివారం రాత్రికి అది భూవాతావరణంలోకి రావచ్చని వారు అంచనా వేశారు.