: కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయాలంటే వ్యాపారం: మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మరోమారు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. హిమాచల్ ప్రదేశ్ లోని సుజన్ పూర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయాలంటే ఓ వ్యాపారమని ఎద్దేవా చేశారు. తమకు రాజకీయాలంటే దేశ సేవతో సమానమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రజలెవరూ నమ్మడంలేదని చెప్పారు. నమ్మకం లేని వ్యవస్థ, వ్యక్తులను ఇంకా ఉపేక్షించడం ఎందుకని ప్రశ్నించారు. ఇక, హిమాచల్ ప్రదేశ్ వాసులను ఆకట్టుకునేలా.. దేశ సేవలో హిమాచల్ ప్రదేశ్ ది కీలకపాత్ర అని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ యువత మెలకువగా ఉన్నందునే దేశం ప్రశాంతంగా నిద్రపోతోందని అన్నారు.
ఈ పుణ్యభూమికి, ఈ వీరభూమికి ప్రణమిల్లుతున్నానని పేర్కొన్నారు. హిమాచల్ వాసులు మద్దతిస్తే, విజయంతో తిరిగివచ్చి రుణం తీర్చుకుంటానని ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయికి ఈ రాష్ట్రం అంటే ఎంతో ప్రేమని చెప్పుకొచ్చారు. యాపిల్ కు మంచి ధర కల్పించి, ఇక్కడి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే హిమాలయ రాష్ట్రాల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.