: సౌరశక్తిని విరివిగా వినియోగించుకోవాలి: మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
ప్రకృతి వరమైన సౌరశక్తిని ప్రజలందరూ వినియోగించుకోవాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సలహా ఇచ్చారు. సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో.. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో నెట్ క్యాప్ ఆధ్వర్యంలో ‘‘సోలార్ ఎక్స్ పో 2014’’ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సోలార్ ప్రదర్శనను మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న 50 శాతం రాయితీతో సౌరశక్తిని వినియోగించుకోవాలని కన్నా పిలుపునిచ్చారు. ఈ ఎక్స్ పోలో ప్రదర్శనకు ఉంచిన టేబుల్ ఫ్యాన్లు, సౌర లాంతర్లు, వాటర్ హీటర్లు, నీటి మోటార్లు, సోలార్ ఫెన్సింగ్ వంటి వస్తువుల వివరాలను సందర్శకులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ హరనాథ్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంతకు ముందున్న ధరలతో పోలిస్తే.. తక్కువ ధరలకే సౌరశక్తి ఉపకరణాలు లభ్యమవుతున్నాయని చెప్పారు.