: నామా, రమేష్ రాథోడ్ పై చంద్రబాబుకు ఫిర్యాదు చేశా: మోదుగుల
పార్లమెంటులో టీబిల్లు ప్రవేశపెట్టడం టీడీపీ ఎంపీల మధ్య విబేధాలను రాజేసింది. ఆ సమయంలో తెలంగాణ టీడీపీ ఎంపీలు సీమాంధ్ర ఎంపీలపై దాడి చేయటం ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు రేపింది. ఈ క్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ లపై.. సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణు గోపాల్ రెడ్డి మండిపడ్డారు. సభలో వారిద్దరూ తనను అడ్డుకున్నారని, ఇతర పార్టీ ఎంపీలతో కలిసి తమపై దాడి చేశారన్నారు. సభలో వారి తీరు తమకు చాలా బాధాకరంగా ఉందన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశామని, స్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
ఎంపీ నామాను తమ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఒప్పుకోవడం లేదన్నారు. తెలంగాణకు సీఎం కావాలనే ఉద్దేశంతోనే నామా అలా చేస్తున్నారని ఆరోపించారు. తన ప్రాంతం (ఖమ్మం) కోసం పని చేసే నామా నా (మోదుగుల) ప్రాంతం గుంటూరుకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అందుకే రాబోయే రోజుల్లోనూ ఆయనను అంగీకరించమని స్పష్టం చేశారు. తమపై దాడి జరిగితే ఆ బాధ్యత ఎవరిదని, కొనకళ్లకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.