: ఘటనకు సోనియాగాంధీయే బాధ్యత వహించాలి: చంద్రబాబు
పార్లమెంటులో ఈ రోజు చోటుచేసుకున్న ఘటనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే పూర్తి బాధ్యత వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జరిగిన ఘటన సరైనది కాదని, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులకు బాధ్యులెవరని ఆయన అడిగారు. సొంత పార్టీ మంత్రులు, ఎంపీలు వెల్ లోకి వచ్చినా కాంగ్రెస్ మొండిగా వ్యవహరించిందని అసహనం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం ఇరు ప్రాంత నేతలతో ఎందుకు సమావేశం నిర్వహించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బాబు, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లోక్ సభలో ఈ రోజు చేపట్టిన ప్రక్రియలో కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. సోనియా ఎలా ఆడిస్తే అలా నడుచుకోవాలని చూస్తున్నారన్నారు.
ఘటనపై బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ సహా జాతీయ నేతలందరూ మాట్లాడుతుంటే సోనియా, రాహుల్, ప్రధాని మాత్రం ఎందుకు నోరు విప్పలేదని మండిపడ్డారు. మొత్తానికి తెలుగు జాతి నిర్వీర్యమయ్యే స్థాయికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నితమైన సమస్యను జఠిలం చేశారన్నారు. ఢిల్లీలో కూర్చుని తెలుగుజాతిని వీడదీయడానికి వారెవరని సూటిగా అడిగారు. కాగా, పార్టీ ఎంపీ కొనకళ్ల నారాయణ పరిస్థితి నిలకడగా ఉందని చంద్రబాబు చెప్పారు.