: బ్యాంకు ఖాతా లేకున్నా.. ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు
బ్యాంకింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. కోరుకున్న వారికి డబ్బులు పంపించాలంటే వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయాలి. అక్కడ వారు వాటిని డ్రా చేసుకోవాలి. ఇదంతా కొన్ని గంటల పని. పైగా పంపించే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఇద్దరికీ బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా ఉండాలి. కానీ, ఇకపై బ్యాంకు ఖాతాలు లేకపోయినా పర్లేదు. నిమిషంలో మీరు డబ్బులు పంపడం.. మరుసటి నిమిషంలో ఎక్కడో ఉన్న మరొకరు డబ్బులు తీసుకోవడం చాలా సులభం. సమీప భవిష్యత్తులోనే ఇది సాకారం కాబోతుంది.
ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నామని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రంగరాజన్ తెలిపారు. ముందుగా డబ్బులు పంపాలనుకున్న వ్యక్తికి మాత్రం బ్యాంకు ఖాతా ఉండాలి. వారు ఏటీఎంకు వెళ్లి డబ్బులు పంపాల్సి ఉంటుంది. అయితే ఖాతాకు కాదు. మొబైల్ నంబర్ ఆధారంగా ఆ డబ్బు ఒక ప్రత్యేక ఖాతాకు బదిలీ అవుతుంది. మరుక్షణమే ఒక పాస్ వర్డ్ డబ్బులు తీసుకోవాల్సిన వ్యక్తి మొబైల్ కు వెళుతుంది. అతను ఏటీఎంకు వెళ్లి మొబైల్ కు వచ్చిన పిన్ నంబర్ కొడితే నిర్ణీత మొత్తం బయటకు వస్తుంది.