: ఇవాళ్టి గూగుల్ డూడుల్ గా.. సరోజినీదేవి నాయుడు
సరోజినీదేవి నాయుడు 135వ జన్మదినాన్ని పురస్కరించుకుని.. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్ ఈరోజు (ఫిబ్రవరి 13) ప్రత్యేక డూడుల్ ను రూపొందించింది. గూగుల్ హోం పేజీ ఓపెన్ చేయగానే సరోజినీదేవి ఫోటోతో కూడిన డూడుల్ దర్శనమిస్తోంది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆమె హైదరాబాదులో ఫిబ్రవరి 13, 1879వ సంవత్సరంలో జన్మించారు. గూగుల్ స్పెల్లింగ్ లోని మూడవ అక్షరం మధ్యలో సరోజినీదేవి చిత్రపటాన్ని ఉంచింది. ఆమె స్వతహాగా కవయిత్రి కావడంతో.. అలాగే ఎల్ అక్షరానికి బదులుగా పెన్ ను ఉంచారు.
గూగుల్ దశాబ్ద కాలంగా ప్రత్యేక డూడుల్ లను డిజైన్ చేయించి వెబ్ సైట్ హోం పేజీలో పెడుతోంది. 1998వ సంవత్సరంలో గూగుల్ హోం పేజీలో తొలి డూడుల్ దర్శనమిచ్చింది. ఇక, అప్పటి నుంచి.. ఆ రోజు ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా డూడుల్ డిజైన్ లను విభిన్నంగా, వినూత్నంగా రూపొందించి.. గూగుల్ కంపెనీ నెటిజన్లలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.