: వెంకయ్య నాయుడిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: బీజేపీ ఎమ్మెల్యే యెన్నం


భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈరోజు యెన్నం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే తనకు ముఖ్యమని, ఆ తర్వాతే ఏదైనా అని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసమే తాను బీజేపీలో చేరిన సంగతిని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడుపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బహిరంగ విమర్శలు చేసిన విషయం విదితమే. ఆ యువ ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల బీజేపీ అగ్ర నాయకత్వం వెంటనే స్పందించింది. అందుకోసం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే యెన్నం వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంకయ్య నాయుడికి వెంటనే శ్రీనివాసరెడ్డితో క్షమాపణలు చెప్పించాలని కిషన్ రెడ్డిని రాజ్ నాథ్ సింగ్ ఆదేశించారు. అయితే ఆ విషయంలో వెంకయ్య నాయుడు వెంటనే జోక్యం చేసుకుని, క్షమాపణలు అవసరం లేదని చెప్పారు. అయితే, తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేసేలా యెన్నం శ్రీనివాసరెడ్డికి హితబోధ చేయాలని కిషన్ రెడ్డికి వెంకయ్యనాయుడు సూచించారు. ఆ క్రమంలో భాగంగానే వెంకయ్య నాయుడిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు యెన్నం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

  • Loading...

More Telugu News