: ఇక టెస్టుల్లోనూ వరల్డ్ కప్
క్రికెట్ తొలినాళ్ళలో.. ఐదు రోజుల పాటు సా..గే టెస్టు మ్యాచ్ లను వీక్షించిన అభిమానులు అవే క్రికెట్ కు స్వర్ణ యుగపు రోజులుగా భావించారు. ఆ తర్వాత వన్డే క్రికెట్ రంగ ప్రవేశంతో టెస్టులపై మోజు కాసింత తగ్గింది. ఇటీవలే పురుడు పోసుకున్న మినీ క్రికెట్.. అదే, టి20 ఫార్మాట్.. వచ్చీరావడంతోనే అటు టెస్టులు, ఇటు వన్డేలకు ఒకేసారి ఎసరుపెట్టేలా ప్రభంజనం సృష్టించింది.
దీంతో.. టెస్టులు, వన్డేలను జనరంజకం చేసేందుకు ఐసీసీ ఏకంగా నిబంధనలు సవరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో టెస్టులకు మళ్ళీ పునర్వైభవం కల్పించాలని ఐసీసీ నిర్ణయించింది. అందుకే వన్డే వరల్డ్ కప్ తరహాలోనే టెస్టుల్లోనూ ఓ చాంపియన్ షిప్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మెగా టోర్నీ2017లో ఉంటుంది. ఇంగ్లండ్ వేదిక.
అనంతరం, నాలుగేళ్ళ తర్వాత, అంటే, 2021లో భారత్ ఈ భారీ ఈవెంట్ కు ఆతిథ్యమిస్తుంది. టోర్నీ ఎలా ఉంటుందంటే, 2016 మార్చి నాటికి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తొలి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు నేరుగా సెమీఫైనల్స్ ఆడేందుకు అర్హత సాధిస్తాయి. వాటిలో నెగ్గిన రెండు జట్లు తుదిపోరుకు సిద్ధమవుతాయి. గెలిచిన జట్టుదే టెస్టు వరల్డ్ కప్.