: తుడా ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. 2010లో తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ పదవిపై కాంగ్రెస్ నేతలు చాలామంది ఆశలు పెట్టుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. పార్టీ రాష్ట్ర నాయకత్వం మాజీ ఎమ్మెల్యే వెంకటరమణకు తుడా ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తుడా ఛైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. దీంతో వెంకటరమణ అభిమానులు తుడా ఆఫీస్ ఎదుట బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. పలువురు నేతలు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.
1982, ఆగస్టు 11వ తేదీన తుడా ఆవిర్భవించింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, శ్రీకాళహస్తి, పుత్తూరు మున్సిపాలిటీలతో పాటు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల్లోని 160 పంచాయతీలు తుడా పరిధిలో ఉన్నాయి. తుడా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 11 మంది ఛైర్మన్లుగా పనిచేశారు. ప్రస్తుతం.. వెంకటరమణ 12వ ఛైర్మన్ గా తుడాకు సేవలు అందించనున్నారు.