: ఐపీఎల్ మ్యాచ్ లనూ లక్ష్యంగా చేసుకున్నారట!
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు దేశంలోని కీలక నగరాలనే కాకుండా, ఐపీఎల్ టోర్నీని సైతం లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఐఎం సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ బయటపెడుతున్న నిజాలు భీతిగొలిపేలా ఉన్నాయి. 2011 సీజన్లో పలు మ్యాచ్ లను లక్ష్యంగా చేసుకున్నామని యాసిన్ వెల్లడించాడు అయితే, భద్రత కట్టుదిట్టంగా ఉండడంతో తమ ప్రయత్నాలను విరమించుకున్నామని తెలిపాడు. 2011 ఏప్రిల్ 20న ముంబయి వాంఖడే మైదానంలో జరిగిన ముంబయి ఇండియన్స్-పుణే వారియర్స్ మ్యాచ్ కు యాసిన్ ముఖ్య అనుచరుడు వకాస్ కూడా హాజరయ్యాడు. స్టేడియంలో భద్రత ఎలా ఉందన్న విషయం తెలుసుకునేందుకు అతను ఆ మ్యాచ్ కు వెళ్ళాడని యాసిన్ చెప్పాడు.
ఆ తర్వాత వకాస్, అసదుల్లా అక్తర్ తో కలిసి మరోసారి స్టేడియం బయట రెక్కీ నిర్వహించాడని, అయితే, భద్రత వలయాన్ని ఛేదించడం శక్తికి మించిన పని అని తెలుసుకుని మిన్నకుండిపోయామని వివరించాడు. వకాస్, అక్తర్ ముంబయిలోని జుహూ బీచ్ తో పాటు గోవాలోని బీచ్ వద్దా రెక్కీ నిర్వహించారని ఈ కరడుగట్టిన ఉగ్రవాది వెల్లడించాడు. గత ఏడాది అరెస్టయిన వకాస్, అక్తర్ ప్రస్తుతం మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అదుపులో ఉన్నారు.