: గుంటూరు జిల్లాలో మెరుగైన వైద్యసేవల కోసం..‘డయల్ యువర్ ఆఫీసర్’
గుంటూరు జిల్లాలో రోగులకు పలురకాలైన వైద్యసేవలను మరింత సమర్థవంతంగా అందించే లక్ష్యంతో ‘‘డయల్ యువర్ ఆఫీసర్’’ కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ఈరోజు (మంగళవారం) ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ ఉత్తర్వుల మేరకు డీఎంహెచ్ఓ గోపీనాయక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇక నుంచి ప్రతి నెలా రెండవ, నాలుగవ మంగళవారం ఈ కార్యక్రమం ఉంటుందని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104 తదితర సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేరుగా ఫిర్యాదు చేయలేని వారు ఫోన్ ద్వారా తెలియజేయగలుగుతున్నారని అధికారులు చెప్పారు. కేవలం ఫిర్యాదులు నమోదు చేయడమే కాకుండా, ఆ సమస్య పరిష్కారమయ్యేవరకూ తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు.