: సచిన్ కు ఢిల్లీ టెస్టే చివరిదా...?


క్రికెట్ ఓ మతమైతే.. సచిన్ టెండూల్కర్ ఓ దేవుడు! ఈ జెంటిల్మన్ గేమ్ లో అంతలా ప్రాచుర్యం పొందిన ఆటగాడు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ప్రపంచ క్రికెట్ పై ఈ ముంబయి చిన్నోడు వేసిన ముద్ర అలాంటిది. సర్వోన్నత బ్యాటింగ్ నైపుణ్యం, అనితరసాధ్యమైన రికార్డులు, మహోన్నత వ్యక్తిత్వం.. వెరసి సచిన్ టెండూల్కర్. భారత దేశం గర్వించదగ్గ ఈ లెజెండ్ ఇప్పుడు కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. అందుకు సూచనగా ఇటీవలే వన్డేలు, టి20 పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు కూడా.

మనమిప్పుడు సచిన్ ఆట చూడాలంటే టెస్టు మ్యాచ్ ల్లోనే సాధ్యం. అయితే, తాజా ఫామ్ దృష్ట్యా సచిన్ ఇక ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని క్రికెట్ పండితుల అభిప్రాయం. ఎందుకంటే, ఇంగ్లండ్ తో సిరీస్ లో దారుణ వైఫల్యం దరిమిలా వచ్చే సిరీస్ లో తన ఆటతీరు సమీక్షించుకోనున్నట్టు సచినే స్వయంగా చెప్పాడు. ఆసీస్ తో సిరీస్ లో ఈ బ్యాటింగ్ దిగ్గజం పేరిట ఒక్క భారీ ఇన్నింగ్సూ నమోదు కాలేదు.

చెప్పుకోదగ్గ ప్రదర్శన అంటే చెన్నయ్ లో ఆసీస్ పై చేసిన 81 పరుగులే. సెంచరీ చేసి చాన్నాళ్ళైంది. ఈ నేపథ్యంలో సచిన్ కు ఆసీస్ తో సిరీస్ లో ఆఖరుదైన ఢిల్లీ టెస్టే చివరిదనుకోవాలేమో. భారత్ ఈ సిరీస్ లో గెలిచింది కాబట్టి సరిపోయింది, అదే ఢక్కామొక్కీలు తినుంటే మాత్రం విమర్శకులకు సచిన్ బలయ్యేవాడే. అతను ఇక తప్పుకుంటే కుర్రాళ్ళకు చాన్స్ వస్తుంది అనేవాళ్ళ సంఖ్య పెరిగేది.

ఇక ఆసీస్ తో సిరీస్ అనంతరం భారత్ మళ్ళీ టెస్టులాడేందుకు దాదాపు ఎనిమిది నెలల విరామం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటన రూపంలో సిరీస్ ఈ ఏడాది చివరిలో ఉంటుంది. పైగా, సచిన్ 40వ పడిలో పడుతున్నాడు. తన వీడ్కోలుకు సచిన్ అంతకాలం వేచిచూడడన్నది అతని సన్నిహితుల మాట. ఇక ఢిల్లీ టెస్టుతో సచిన్ తనకిష్టమైన ఆటకు సగర్వంగా వీడ్కోలు పలుకుతాడేమో చూడాలి. 

  • Loading...

More Telugu News