: కొత్త రాజధానికి మూడు లోకేషన్లను సూచించిన సర్కారు


రాష్ట్ర విభజన విషయంలో ఒకవైపు అయోమయం కొనసాగుతుండగా.. మరోవైపు విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని విషయంలో రాష్ట్ర సర్కారు కేంద్రానికి మూడు ప్రాంతాలను సూచించినట్లు తెలిసింది. అవి కాకినాడ, గుంటూరులోని వినుకొండ నుంచి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మధ్య, గుంటూరు జిల్లాలోని మాచెర్ల. ఈ మూడు చోట్ల తగినంత అటవీ స్థలాలు ఉన్నాయి కనుక భూసేకరణ సమస్య ఉండదని సర్కారు అభిప్రాయం.

మార్కాపురం విజయవాడ-బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో ఉంది. నీటి వసతికి శ్రీశైలం, గుండ్లకమ్మ ప్రాజెక్టులు ఉన్నాయి. పైగా రాయలసీమకూ దగ్గరగా ఉంటుంది. మాచర్ల ప్రాంతం అయితే, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి అవసరాలు తీర్చుకోవచ్చు. హైదరాబాద్-గుంటూరు మధ్య జాతీయ రహదారి, రైల్వేలైన్ ఉండడం కలిసి వచ్చే అంశాలు.

ఇక కాకినాడకు సమీపంలోనూ అటవీ భూములు ఉన్నాయి. గోదావరి నీటి వసతి అందుబాటులో ఉంది. హౌరా-చెన్నై జాతీయ రహదారి మార్గంలో ఉంది. అయితే, వీటిలో ఏ ఒక్కదానికీ విమానాశ్రయం లేదు. స్థానికంగా చిన్నవి ఏర్పాటు చేసి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని సర్కారు అభిప్రాయం. కానీ, మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ మాత్రం దీన్ని ఖండించారు. కొత్తగా రాజధానిని ఎక్కడో పెట్టి అభివృద్ధి చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. దానికి బదులుగా విజయవాడ-గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయడం అన్ని విధాలుగా సరైనదని చెప్పారు.

  • Loading...

More Telugu News