: తూర్పు గోదావరి జిల్లాలో ఘవంగా ‘సత్తెమ్మ సంబరం’
తూర్పుగోదావరి జిల్లాలో ‘సత్తెమ్మ సంబరం’ ఘనంగా జరిగింది. అనపర్తి మండలంలోని కొప్పవరంలో కర్రివారి ఆడపడుచుగా పేరొందిన సత్తెమ్మ సంబరాన్ని రెండేళ్లకోసారి ఘనంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాలతో పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. రెండో రోజైన ఆదివారం నాగదేవత ప్రతిరూపంగా అమ్మవారిని భావించి కొప్పవరం గ్రామస్థులందరూ.. పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. సంతానం లేనివారు అమ్మవారిని ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మధ్యాహ్నం కొట్టుడు సంబరం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారిని నానా రకాలుగా తిట్టి.. ఆయనతో భక్తులు బెత్తం దెబ్బలు తినడం అక్కడి ఆచారం. బెత్తం దెబ్బ తగిలితే.. తెలిసో, తెలియకో చేసిన పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
ఇవాళ (సోమవారం) చివరి రోజున ఈ సంబరం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. గత సంబరాల్లో కోరుకున్న మొక్కులు తీరిన వారు.. ధనిక, పేద తేడా లేకుండా కొప్పవరం వీధుల్లో బిచ్చమెత్తుతారు. కోరికలు తీరిన ప్రతి వ్యక్తి విచిత్ర వేషధారణలో భిక్షాటనకు వెళతాడు. ఈ ఉదయం నుంచి ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. అనంతరం జరిగిన అన్నదానం కార్యక్రమంతో సంబరం ముగిసింది.