: ర్యాంకుల జాబితాలో జారిపడ్డ టీమిండియా స్టార్లు


కివీస్ తో తొలి టెస్టు ఓటమి అనంతరం టీమిండియా క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగుల్లో కిందికి జారారు. నేడు విడుదల చేసిన ర్యాంకింగ్ జాబితాలో బ్యాటింగ్ విభాగంలో ఛటేశ్వర్ పుజారా, బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ ఓ స్థానం పతనమయ్యారు. పుజారా ఐదు నుంచి ఆరుకు, అశ్విన్ ఏడు నుంచి ఎనిమిదికి పడిపోయారు. కాగా, బ్యాటింగ్, బౌలింగ్ టాప్ టెన్ జాబితాల్లో ఉన్న టీమిండియా క్రికెటర్లు వీరిద్దరే కావడం విశేషం. విరాట్ కోహ్లీ తన 11వ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక కెప్టెన్ ధోనీ ఐదు స్థానాలు పతనమై 33వ ర్యాంకుకు చేరాడు. బౌలింగ్ లో స్పిన్నర్ ఓజా 11వ స్థానంలోనూ, సీనియర్ పేసర్ జహీర్ 22వ స్థానంలోనూ కొనసాగుతున్నారు.

బ్యాటింగ్ ర్యాంకుల్లో తొలి స్థానాన్ని ఏబీ డివిల్లీర్స్ పదిలపరుచుకోగా, బంగ్లాదేశ్ తో టెస్టులో ట్రిపుల్ బాదిన లంక వీరుడు కుమార సంగక్కర రెండోస్థానానికి ఎగబాకాడు. మూడో స్థానంలో వెస్టిండీస్ వెటరన్ బ్యాట్స్ మన్ శివనారాయణ్ చందర్ పాల్ ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికన్లు ఫిలాండర్, డేల్ స్టెయిన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో ర్యాంకులో ఆసీస్ తురుపుముక్క ర్యాన్ హారిస్ కొనసాగుతున్నాడు.

  • Loading...

More Telugu News