: కరీంనగర్ కు సిటీ బస్సు డిపో వస్తోంది
కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందనున్నాయి. జిల్లా కేంద్రంలో డిపో ఏర్పాటుకు ఇప్పటికే అనుమతి ఇవ్వగా.. డిపో కోసం 25.5 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్ఎన్ యూఆర్ఎం పథకంగా భాగంగా దేశవ్యాప్తంగా 13 నగరాలకు సిటీ బస్సుల సౌకర్యం కల్పించింది. ఈ జాబితాలో కరీంనగర్ కూడా ఎంపికైన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా 75 బస్సులు మంజూరు చేసింది. డిపో ఏర్పాటుకు అనుమతితో పాటు అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్రం నుంచి వరంగల్, నెల్లూరు, కర్నూలు, నిజామాబాద్, నంద్యాల, కరీంనగర్, రామగుండం, విజయనగరం, ఒంగోలు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరులలో సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మొత్తం 12 ప్రతిపాదనలు పంపించగా.. ఒక్క కరీంనగర్లో మాత్రమే సిటీ బస్సుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.