: తమిళనాడు హోంగార్డుల్లో ట్రాన్స్ జెండర్లకు చోటు
పుట్టుకే అపచారం..
సృష్టి లిఖిత గ్రహచారం..
నేటికీ సమాజ సరిహద్దుల్లోనే సంచారం..!
సంక్షిప్తంగా ఇదీ.. జన్యు లోపాలతో జన్మించి సమాజంలో చీత్కరింపులకు గురయ్యే హిజ్రాలు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్ల జీవితం. ఈ తృతీయ సమాజానికి చెందిన వ్యక్తులను నేటికీ మన కుటుంబ వ్యవస్థలో చోటు కల్పించలేకపోతున్నాం. వివాహానికి పనికిరారు, ప్రత్యుత్పత్తికి అనుకూలురు కారు అన్న కారణాలు వారిని సాంఘిక సమాజం సరిహద్దుల్లోనే నిలబెడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజల్లో కాసింత చైతన్యం వస్తోందీ విషయంలో. అందుకే వారు రాజకీయాల్లోనూ, టీవీ రంగంలోనూ, సినిమాల్లోనూ తమ ఉనికిని చాటుకోగలుగుతున్నారు. తాజాగా తమిళనాడు పోలీసు శాఖ ట్రాన్స్ జెండర్లను హోంగార్డులుగా నియమించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. తాజా నియామకాల్లో ఆరుగురిని ఎంపిక చేసిన తమిళనాడు పోలీస్ శాఖ వారికి ప్రస్తుతం ట్రెయినింగ్ ఇస్తోంది.
కాగా, తమ ఎంపికపై శక్తి (26) అనే ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ, తమను అందరూ చక్కగా చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసింది. తాను ఇంతకుముందు చీర కట్టుకుని బెంగళూరులో ఓ షాపులో పనిచేసే దాన్నని, తాజా ఉద్యోగంతో ఎంతో ఆనందంగా ఉన్నానని షణ్ముగనాథన్ అనే ట్రాన్స్ జెండర్ తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం తృతీయ సమాజం వ్యక్తులకు రేషన్ కార్డులు ఇస్తోండగా.. అక్కడి కాలేజీలు, యూనివర్శిటీలు, కార్యాలయాలు వారికి ఆహ్వానం పలకడం హర్షణీయం.