: పోజులు కొట్టే తారలకు లక్షలే లక్షలు!
ఢిల్లీలోని నోయిడాలో జరుగుతున్న ఆటోఎక్స్ పో-2014 పలువురిని ఆకర్షిస్తోంది. నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఈ ఎక్స్ పోలో బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎక్స్ పోలో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించుకునేందుకు టాప్ పొజిషన్లో ఉన్న హీరోలకు, హీరోయిన్లకు ఒక్కో కంపెనీ లక్షలు చెల్లిస్తోంది. కేవలం పది నుంచి ఇరవై నిమిషాల పాటు ఉత్పత్తి ముందు, పక్కన నిలుచుని చిరునవ్వులు చిందిస్తూ, వయ్యారాలు ఒలకబోస్తే చాలు... లక్షల రూపాయలు వారి అకౌంట్లలో పడిపోతాయి.
మరింత లోతుగా వెళ్తే... కొత్త హంగులతో రూపొందించిన ఎస్ యూవీ కారు ముందు కరీనాకపూర్ ఫోజులిచ్చింది. దాదాపు 15 నుంచి 20 నిమిషాలపాటు ఫోటోలకు ఫోజిలిచ్చి రూ.30 లక్షల పైనే తీసుకుంది. ఖరీదైన కారు పైన కూర్చోని, పక్కన నిలుచుని హాట్ హాట్ గా ప్రియాంక చోప్రా పోజులిచ్చింది. ఆ ఇరవై నిమిషాలకే ఈ అమ్మడు ఏకంగా నలభై లక్షలు చార్జ్ చేసిందట. మరోవైపు ఎల్లప్పుడూ బైక్ లంటే తెగ మోజుపడే హీరో జాన్ అబ్రహాం ఓ బ్రాండెడ్ బైక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ బైక్ పై కూర్చుని, నడిపినట్లు పోజిచ్చాడు. ఇక మన రణ్ బీర్ కపూర్ రెండు స్కూటర్ల బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు. ఇప్పటికే వీరితో ఒప్పందం కుదుర్చుకున్న ఆ కంపెనీలు వాణిజ్య ప్రకటనకు, ఎక్స్ పోలో కనిపించినందుకు కోట్లు చెల్లిస్తున్నాయి. జాన్ రూ.3-4 కోట్లు, రణ్ బీర్ రూ.10-11 కోట్లు తీసుకున్నారు.
దీనిపై ఓ ఇండస్ట్రీ ఇన్ సైడర్ మాట్లాడుతూ.. అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న నటులు కొంతసేపు ఉత్పత్తుల ముందు కనిపించినందుకు వారి పాప్యులారిటీని బట్టి రేటు ఉంటుందన్నారు. అంతేకాక వారికి, వారి సిబ్బంది ఉండేందుకు సౌకర్యవంతమైన ఫైవ్ స్టార్ హోటల్లో వసతి కూడా కల్పిస్తారని చెప్పారు.