: ఆడలేక మద్దెల వోడు అన్నట్టు..
వెనకటికెవరో 'ఆడలేక మద్దెల వోడు' అన్నాడట. టీమిండియా బ్యాట్స్ మెన్ పరిస్థితీ ఇలాగే ఉంది. కివీస్ పర్యటనలో బౌన్సీ పిచ్ లపై ఆడేందుకు మనవాళ్ళు ఆపసోపాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ విజయ్ ఏమంటున్నాడో వినండి. తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, కొత్త బంతి కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు. తామే కాదు, ఆతిథ్య జట్టు సైతం కొత్త బంతితో ఇక్కట్లు ఎదుర్కొందని వివరించాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 51 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. విజయ్ 26 పరుగులు చేశాడు. బంతి రెండు వైపులా స్వింగ్ అవడమే కాకుండా, అనూహ్యంగా మీదికొస్తూ బ్యాట్స్ మెన్ కు పరీక్ష పెట్టిందని తెలిపాడు. బంతి నలిగిన తర్వాత ఆటకు అనుకువుగా మారిందని పేర్కొన్నాడు. అదృష్టవశాత్తూ రోహిత్, రహానే కుదురుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని వివరించాడీ తమిళతంబి.