: మా ఆవిడకు ఏమైనా అయితే.. నాదే బాధ్యత: ఎమ్మెల్యే వెంకటరమణ
తన భార్య సునీత చేసిన ఆరోపణలు అవాస్తవమని కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు. తన నుంచి ప్రాణహాని ఉందని సునీత చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తనకు పిల్లల భవిష్యత్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అందుకే మానవత్వంతో ఆమె చేసిన పొరపాట్లను సహిస్తున్నానని ఆయన చెప్పారు. మా ఆవిడకు ఏదైనా జరిగితే తనదే పూర్తి బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారు. కోటి రూపాయలు ఇవ్వాలని సునీత తనను బెదిరిస్తోందని ఆయన పేర్కొన్నారు. డబ్బు కోసమే ఇలా ఫిర్యాదులు ఇస్తోందని ఆయన తెలిపారు. పిల్లల భవిష్యత్ కోసమే తాను బతుకుతున్నానని ఆయన చెప్పారు. తన భార్యతో కలిసి ఉందామని ఇప్పటికీ అనుకుంటున్నానని వెంకటరమణ తెలిపారు. హైకోర్టు ఆదేశించినా పిల్లలను స్కూలుకు పంపకపోవడం కోర్టు ధిక్కారం అవుతుందని ఆయన అన్నారు.
వెంకటరమణ తనను ఇప్పటికీ మనిషిగా గుర్తించడం లేదని, తనను పనిమనిషిగా కన్నా హీనంగా చూశారని సునీత ఆరోపించారు. అధికారం ఉందన్న గర్వంతో ఆయన విర్రవీగుతున్నారని ఆమె తెలిపారు. పెళ్లైన నాటి నుంచి నరకం అనుభవిస్తున్నానని ఆమె చెప్పారు. పిల్లల పేరు చెప్పి తన భర్త తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. నిజంగా పిల్లలపై ప్రేమ ఉంటే.. జ్వరమొచ్చినా వాళ్లను ఎందుకు పట్టించుకోలేదని ఆమె నిలదీశారు. ఎమ్మెల్యేగా ఆయన ఆస్తులను బాగా సంపాదించినా.. దాచి పెట్టాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఆయనతో కలసి కాపురం చేయలేనని సునీత స్పష్టం చేశారు.