: వెంకయ్యనాయుడితో చంద్రబాబు రహస్య ఒప్పందం: చీఫ్ విప్ గండ్ర
బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడితో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని... ప్రస్తుతం దాన్నే అమలు చేస్తున్నారని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నైజాన్ని ఇప్పటికైనా టీటీడీపీ నేతలు గుర్తించి... పార్టీ నుంచి బయటకు రావాలని సూచించారు. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మిగులు ఓట్లను ఎవరికి వేయాలనే విషయంపై, రేపు ఉదయం నిర్ణయిస్తామని చెప్పారు. పార్టీతో పాటు తెలంగాణ అంశం కూడా ప్రధానమైందే కాబట్టి... తెలంగాణ అభ్యర్థికే ఓటు వేసే పరిస్థితులు కూడా ఉన్నాయని తెలిపారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారు కనుక... ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కేకేకు ఓటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. రేపు ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.