: టీమిండియాను వెంటాడుతున్న 'పీడకల'
భారత క్రికెట్ జట్టు ఏ ముహుర్తాన న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిందో కానీ, అన్నీ ఎదురుదెబ్బలే. వన్డే సిరీస్ లో ఓటమిపాలై, ఇప్పుడు టెస్టు సిరీస్ మొదలు పెట్టింది. నేటు తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగియగా.. అందులోనూ నిరాశే. కివీస్ బ్యాట్స్ మన్ టీమిండియా బౌలర్లను ఓ చూపుచూశారు. ధోనీ గ్యాంగ్ కు చుక్కలు చూపెడుతున్న కివీల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేన్ విలియమ్సన్ గురించి. ఈ 23 ఏళ్ళ యువ బ్యాట్స్ మన్ ఇప్పుడు ఆతిథ్య జట్టు బ్యాటింగ్ లైనప్ కు మూలస్థంభం. భారత్ తో ఐదు వన్డేల సిరీస్ లో బ్యాట్ తో వీరవిహారం చేసిన ఈ చిన్నోడు ఆక్లాండ్ లో నేడు సెంచరీతో మెరవడం విశేషం. బౌన్సీ పిచ్ పై 172 బంతుల్లో 113 పరుగులు చేసి టీమిండియా బౌలర్లను అపహాస్యం చేశాడు. మెక్లీన్ పార్క్ మైదానం నలుమూలలకూ బంతిని పంపి తన బ్యాటింగ్ సాధికారతను చాటుకున్న విలియమ్సన్ కెరీర్లో ఐదో సెంచరీ నమోదు చేసుకున్నాడు.
అంతకుముందు వన్డే సిరీస్ లోనూ ఈ చిచ్చరపిడుగు ఐదు మ్యాచ్ లలో 5 ఫిఫ్టీలతో సత్తా చాటాడు. అంతేగాదు, బౌలింగ్ లోనూ ఓ చేయి వేసి 4 వికెట్లతో తానెంత ఉపయుక్తమో చాటాడు. అటు తన జట్టులో సంతోషం నింపాడు, ఇటు టీమిండియాకు కడగండ్లు మిగిల్చాడు. భారత జట్టు వ్యూహకర్తలు ఇకమీదట విలియమ్సన్ పై ప్రత్యేక వ్యూహాలు పన్నడం మంచిదేమో. లేకుంటే, చాపకింద నీరులా పనిచేసుకుపోయే ఈ యువ బ్యాట్స్ మన్ తో టెస్టు సిరీస్ లో మున్ముందు చిక్కులు తప్పకపోవచ్చు.