: ఫ్రీగా వచ్చింది కదా.. అందుకే!
సినిమా అంటే అందరికీ మక్కువే. అందునా ఫ్రీగా చూడమని ఆఫర్ ఇస్తే.. ఇంకేముంది! పనులన్నీ పక్కన పెట్టేసి ఆగమేఘాల మీద అందరూ ఈ సినిమా హాలుకు వెళ్లిపోయారు. పెద్దలు, కాలేజీకెళ్లే కుర్రాళ్లతో పాటు పదేళ్ల వయస్సు పైబడిన పిల్లలు కూడా పాఠశాలకు డుమ్మా కొట్టీ మరీ చూసేందుకు వచ్చారు. తల్లిదండ్రులు వారించినా వినకుండా మరీ సినిమా హాలుకు బయల్దేరారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు మెసేజ్ ఇచ్చారు. వారు వచ్చి పిల్లలను సినిమా హాలు నుంచి తరిమికొట్టారు. 'కాలేజీ కుర్రాళ్లు చూస్తున్నారు. మేమెందుకు చూడకూడ'దంటూ పోలీసులతో పిల్లలు వాగ్వాదానికి దిగారు. పిల్లలను సముదాయించిన పోలీసులు ఇంటికి పంపేశారు.
తమిళనాడులోని తిరుపూర్ జిల్లా తారాపూర్ గ్రామంలో అజిత్ కథానాయకుడిగా నటించిన ‘వీరం’ చిత్ర ప్రదర్శనను ఓ థియేటర్ లో ఉచితంగా ప్రదర్శించారు. సినిమా హాలు నిర్మించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అన్ని షోలు ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నామని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. దాంతో పరిసర ప్రాంత వాసులు సినిమా చూసేందుకు క్యూ కట్టారు. పెద్దలు, యువకులతో పాటు ఉన్నత పాఠశాల విద్యార్థులు కూడా బడి మానేసి.. భుజానికి బ్యాగులు తగిలించుకుని మరీ సినిమాకు వచ్చారు. అయితే.. చివరకు ఆ చిన్నారులు సినిమా పూర్తిగా చూడకుండానే ఇంటికెళ్లిపోయారు. ‘ఉచిత ప్రదర్శనకు పిల్లలకు అనుమతి లేదు’ అని ముందుగానే బోర్డు పెడితే సరిపోయేదని పెద్దలు అభిప్రాయపడ్డారు.