: అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన..పార్టీలతో లాలూచీ: బాబు
ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నీచాతి నీచంగా ప్రవర్తిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో విభజన మంచిది కాదని, విభజన విచ్ఛిన్నానికి దారి తీస్తుందని అన్నారని గుర్తు చేశారు. గత ఆరు నెలలుగా దేశంలో జరుగుతున్నది ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు.
ఆర్టికల్ 356 ఉపయోగించి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారని, 36 రోజులు ఎన్టీఆర్ ను ఇబ్బందుల పాలు చేసిన ఇందిరా గాంధీ దిగి వచ్చి గవర్నర్ ను తొలగించారని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పడే టీడీపీ 356 దుర్వినియోగం చేయకుండా పోరాడిందని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటు చూసినా ఎస్సార్సీ, కమిషన్లు, కమిటీల ద్వారా జరిగిందని ఆయన గుర్తు చేశారు.
మనం సమాఖ్య వ్యవస్థలో నడవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. 1930 నుంచి ఆర్టికల్ 3 అమలులో ఉందని, దేశంలో కేంద్రం ఎంత ముఖ్యమో, రాష్ట్రాలు కూడా అంతే ముఖ్యమని ఆయన తెలిపారు. యూనియన్ గవర్నమెంటు నడిపేందుకు అవసరమయ్యే ఆర్టికల్ 3ని రాష్ట్రపతి చేతిలో రాజ్యాంగ నిపుణులు పెట్టారని ఆయన చెప్పారు. ఇప్పుడు అందరూ ఆర్టికల్ 3ని ఉపయోగించాలని కోరుతున్నారని, అసలు ఆర్టికల్ 3ని ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగించాలో తెలుసుకోవాలని ఆయన కోరారు.
గతంలో ఎన్డీయే మూడు రాష్ట్రాలను విభజించినప్పుడు చర్చల ద్వారానే విభజించిందని ఆయన గుర్తు చేశారు. బీహార్ ఒప్పుకోకపోతే అక్కడి ప్రజా ప్రతినిధులను ఒప్పించి జార్ఖాండ్ ఏర్పాటు చేశారని తెలిపారు. దేశంలో తెలుగు జాతిని నిట్టనిలువునా చీల్చి అతి పెద్ద సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీ సృష్టించిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడంటే అప్పుడు వార్ రూం అంటోందని, అసలు వార్ రూం అని దేనిని అంటారని ఆయన మండిపడ్డారు. చేతనైతే ఆ గదికి పీస్ రూం అని పేరు పెట్టి సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు.
విభజించాలని నిర్ణయిస్తే సీమాంధ్రులను, సమైక్యమంటే తెలంగాణ ప్రజలను ఒప్పించాలని ఆయన సూచించారు. సమస్య పరిష్కరించడానికి అధికారం ఉండాలే కానీ, సమస్యలు సృష్టించడానికి అధికారం అక్కర్లేదని ఆయన తెలిపారు. తెలుగు జాతిని చీల్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన విమర్శించారు. పీసీసీ చీఫ్, టీఆర్ఎస్ అధినేత భేటీ అయ్యారు, అది దేనికి సంకేతమని, లాలూచీ ఎవరు పడ్డారని బాబు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మూడు పార్టీలు కుమ్మక్కై ఎవరికి వారు స్వార్థ ప్రయోజనాల కోసం కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
పార్లమెంటులో తమ తరువాత అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురు కాకుండా చివరి సెషన్ లో ఓట్ ఆన్ అకౌంట్ కోసం కేటాయిస్తారని, అలాంటిది బిల్లులు ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ నేతలను గెలిపించేందుకు వైఎస్సార్సీపీ నామినేషన్లు వేయలేదని ఆయన మండిపడ్డారు. మరి సమైక్యవాదులంటున్న వైఎస్సార్సీపీ ఆదాలకు ఎందుకు మద్దతివ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు.
హైదరాబాద్, కృష్ణ, గోదావరి నదులను కేంద్రం అధీనంలో తీసుకోవాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. గవర్నర్ చేతుల్లో అధికారాలు ఉంటాయని అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుందని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిస్తే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధిష్ఠానం అండ చూసుకుని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రెండు ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.