: నేడు మేడారంలో మండమెలిగే పండుగ
మేడారం జాతరకు సంబంధించిన తొలి ఘట్టం ఈ రోజు ప్రారంభమవుతుంది. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాల పద్ధతిలో జరిగే ఈ జాతరలో పూజావిధానం అత్యంత గోప్యంగా జరుగుతుంది. అమ్మవార్ల పుజారులందరూ కలసి మండమెలిగే పండుగను జరుపుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. పూజాకార్యక్రమాలు ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమై రేపు తెల్లవారుజామున 6 గంటల వరకు జరుగుతాయి. ఈ సమయంలో అమ్మవార్ల దర్శనానినికి అనుమతించరు. సమ్మక్క పూజారులు ఈ రోజంతా మేడారంలోని సమ్మక్క పూజామందిరంలో ఈ పండుగను నిర్వహిస్తారు.
రాత్రి 8 గంటలకు ప్రధాన పూజారులు, మిగతా పూజారులు ఆలయానికి రాగానే, అప్పటికే ఆలయంలో ఉన్న భక్తులను, దేవాదాయశాఖ అధికారులను, సిబ్బందిని అక్కడి నుంచి పంపుతారు. ఇతరులెవరిని ఆలయ దరిదాపులకు రాకుండా యువకులను కాపాలగా ఉంచుతారు. ఆలయం, పరిసరాల్లో ఉన్న విద్యుదీపాలను వెలగనివ్వరు. రాత్రి నుంచి తెల్లవారుజామువరకు పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులను అమ్మవార్ల దర్శనానినికి అనుమతిస్తారు. గ్రామస్తులెవరూ పూజారులు చేసే పూజలను తెలుసుకోవడానికి సాహసించరు.