: కాకినాడకు కొత్త రైలు వచ్చేసింది!


కాకినాడ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రైలు పట్టాలెక్కింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా వాసుల చిరకాల కోరిక తీరింది. వారానికి రెండు సార్లు నడిచే కాకినాడ-ముంబై రైలును కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు ప్రారంభించారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేక రిమోట్ ద్వారా నూతన రైలుకు సంకేతాలిచ్చిన (గ్రీన్ సిగ్నల్) అనంతరం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం 9.45 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.05 గంటలకు ముంబై చేరుతుంది. అలాగే ముంబై నుంచి గురు, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు బయల్దేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు బుధవారం నుంచి యథాతథంగా రాకపోకలు సాగిస్తుందని వారు వెల్లడించారు.

ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి పళ్లంరాజు అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ వాణిజ్య రాజధానిగా ఉన్న ముంబైకి కాకినాడ నుంచి నేరుగా రైలు ఏర్పాటు చేయడంతో గోదావరి జిల్లావాసులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అలాగే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాదుకు ఏర్పాటు చేసిన కాకినాడ ఎక్స్ ప్రెస్ ను ప్రతి రోజూ నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, డివిజన్ కు 25 శాతం ఆదాయం కాకినాడ ప్రాంతం నుంచే వస్తోందని పేర్కొన్నారు. విజయవాడ డివిజన్ లో ఎ-కేటగిరీ స్టేషన్ లో ఎస్కలేటర్లు, లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News