: అర్ధ రూపాయికే కారు ప్రయాణం
కిలోమీటరుకు అర్ధరూపాయి పెట్టుకుంటే కారులో షికారు చేయవచ్చు. ఆడుతూ పాడుతూ కుటుంబ సమేతంగా చౌకగా ప్రయాణం కట్టవచ్చు. అందు కోసం మీరు మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకొచ్చిన ఎలక్ర్టిక్ కారు ఈ2వో కొనుక్కోవాలి మరి. దీని ధర ఆరు లక్షల రూపాయలు. అమ్మో అనకండి. ఇంత తక్కవ ధరలో అంత చౌక ప్రయాణం అందించే మరో కారు మార్కెట్లో లేదు మరి.
ఎలక్ర్టిక్ కార్ల తయారీ కంపెనీ రెవా గుర్తుండే ఉంటుంది. ఈ కంపెనీని మూడేళ్ల క్రితం మహీంద్రా కొనుగోలు చేసింది. ఇన్నేళ్ల తర్వాత సరికొత్త ఎలక్ర్టిక్ కారును భారతీయ మార్కెట్ కు అందించింది. వాస్తవానికి ఎలక్ర్టిక్ కారు ప్రపంచ వ్యాప్తంగా విజయవంతం కాలేదు. కారణం బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ దూరం రాకపోవడమే.
ఈ2వో కారు ప్రత్యేకతలు చూస్తే.. ఒక్కసారి ఐదు గంటల పాటు చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. 81 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. బ్యాటరీకి మూడేళ్లపాటు లేదా 60 వేల కిలోమీటర్లు ఏది ముందైతే దానికి వారంటీ ఉంటుంది. బ్యాటరీని మార్చుకోవాలంటే లక్షన్నర రూపాయలు భరించాలి. ఇదొక్కటే మైనస్ పాయింట్. ఈ కారు భారతీయ కారు మార్కెట్ దిశను మారుస్తుందని మహీంద్రా భావిస్తోంది. రెనాల్ట్, నిస్సాన్, మిట్సుబిషి కంపెనీల ఎలక్ర్టిక్ కార్లు 17లక్షల రూపాయలపైనే ఉన్నాయి. వాటితో పోలిస్తే ఈ2వో చౌకే.