: అండమాన్ మరో కార్గిల్ కానుందా?
కార్గిల్ యుద్ధం.. ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తిని రగిల్చిన ఉదంతం. 1999లో పాక్ సేనలు కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోగా, భారత సైన్యం వీరోచిత పోరాటంతో మన భూభాగాన్ని శత్రు విముక్తం చేసింది. ఇప్పుడలాంటిదే మరో ప్రమాదం పొంది ఉందంటున్నారు భారత నావికాదళ రిటైర్డ్ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్. అండమాన్ నికోబార్ దీవులకు మరో కార్గిల్ ను తలపించే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. జనావాసయోగ్యం కాని కొన్ని దీవులు మాదకద్రవ్యాలకు రవాణాదారులుగా, టెర్రరిస్టు గ్రూపులకు ఆవాసంగా మారతాయని అన్నారు.
గోవాలోని పనాజిలో తీరప్రాంత రక్షణపై జరిగిన ఓ సదస్సులో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ దీవులను ప్రక్షాళన చేయాలంటే భారత్ మరో కార్గిల్ స్థాయి ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అంతేగాకుండా, బంగాళాఖాతంలో 573 దీవులున్నాయని, వాటిపై ఆధిపత్యం చేజిక్కించుకుని నావికాదళ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు పొరుగుదేశాలు ప్రయత్నించే అవకాశాలనూ కొట్టిపారేయలేమని అరుణ్ ప్రకాశ్ అభిప్రాయపడ్డారు.